సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘తాయ్ కిళవి’.. ఆమె రాధిక అంటే నమ్ముతారా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక తమిళ సినిమా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఆ సినిమా పేరు ‘తాయ్ కిళవి’ (Thai Kilavi). ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అందులో గొడుగు పట్టుకుని, పక్కా పల్లెటూరి వృద్ధురాలి గెటప్‌లో, ఎంతో రస్టిక్ గా కనిపిస్తున్న ఆ ప్రధాన పాత్రధారి ఎవరో గుర్తుపట్టడం ఎవరి తరం కావడం లేదు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, లేదా పోస్టర్‌పై ఉన్న పేరును భూతద్దం పెట్టి వెతికితే తప్ప.. ఆ క్యారెక్టర్ చేసింది మనకు సుపరిచితమైన సీనియర్ నటి ‘రాధికా శరత్‌కుమార్’ (Radikaa Sarathkumar) అని ఎవరికీ అర్థం కాదు!
అవును, మీరు విన్నది నిజమే. ఆ పోస్టర్ లో ఉన్నది రాధికనే. నటిగా ఆమె డెడికేషన్ ఏంటో ఈ ఒక్క పోస్టర్ తో అర్థమైపోతోంది. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటి, మేకప్ లేకుండా, తన వయసును మించిన పాత్రలో ఇంత సహజంగా ఒదిగిపోవడం చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు మన తెలుగు సినీ అభిమానుల్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది.
మన తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు?
‘తాయ్ కిళవి’ లాంటి సినిమాలు, రాధిక లాంటి క్యారెక్టరైజేషన్లు చూసినప్పుడు.. “అసలు ఇలాంటి కంటెంట్ మన టాలీవుడ్లో ఎందుకు రాదు?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి:
1. హీరో వర్షిప్ మరియు కమర్షియల్ మీటర్: మన తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా స్టార్ హీరోల చుట్టూ, కమర్షియల్ ఫార్ములా చుట్టూ తిరుగుతుంటుంది. ఒక సినిమా తీయాలంటే అందులో ఆరు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్ గ్లామర్.. ఇవి తప్పనిసరి అనే మైండ్‌సెట్‌లో మేకర్స్ ఉండిపోయారు. ఒక వృద్ధురాలిని లేదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ను లీడ్ రోల్లో పెట్టి, అద్భుతమైన కథను నడిపించే ధైర్యం మన దర్శకులు, నిర్మాతలు చేయలేకపోతున్నారు.
2. సీనియర్ నటీమణులకు ‘అమ్మ’ పాత్రలే గతి! కోలీవుడ్ (తమిళం), మాలీవుడ్ (మలయాళం) ఇండస్ట్రీలలో సీనియర్ నటీమణులకు ఇచ్చే గౌరవం వేరు. ఊర్వశి, రేవతి, రాధిక లాంటి వారి కోసం ప్రత్యేకంగా కథలు రాసుకుంటారు దర్శకులు. వారిలోని నటనను వంద శాతం వాడుకుంటారు. కానీ మన తెలుగులో ఒక హీరోయిన్ వయసు దాటిందంటే చాలు.. హీరోకి సెంటిమెంట్ పండించే తల్లిగానో, లేదా విలన్‌కి అత్తగానో ఫిక్స్ చేసేస్తారు. వారిలోని అసలైన నటులను బయటకు తీసే స్కోప్ ఉన్న పాత్రలు రాయడంలో మన రచయితలు వెనుకబడి ఉన్నారు.
3. బాక్సాఫీస్ భయం: ఇలాంటి ప్రయోగాత్మక, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? ఓపెనింగ్స్ వస్తాయా? అనే భయం మన నిర్మాతల్లో బలంగా నాటుకుపోయింది. కానీ, కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ ఎప్పుడూ సినిమాను బతికించారు. ‘కలర్ ఫోటో’, ‘బలగం’ లాంటి సినిమాలు స్టార్స్ లేకపోయినా కంటెంట్‌తో ఎంత పెద్ద హిట్టయ్యాయో మనం చూశాం. అయినా సరే, ఇండస్ట్రీ పెద్దలు సేఫ్ గేమ్ ఆడటానికే ఇష్టపడుతున్నారు.
మార్పు రావాలి.. కంటెంట్ గెలవాలి! ‘తాయ్ కిళవి’ లాంటి ఒక సినిమా కేవలం పోస్టర్ తోటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అందులో కథ ఎంత బలంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రేక్షకుల ను ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన టాలీవుడ్ డైరెక్టర్లు కూడా కేవలం స్టార్ హీరోల డేట్స్ కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాయకుండా.. రాధిక, రమ్యకృష్ణ లాంటి పవర్ఫుల్ నటీమణులతో ఇలాంటి రా అండ్ రస్టిక్ కథలను నమ్ముకుంటే, తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది.
ఏదేమైనా, ఒక నటిగా తనను తాను ఈ స్థాయిలో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్న రాధిక గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
మరి మీరేమంటారో కామెంట్ లో మాతో పంచుకోండి
