పాన్-ఇండియా ‘వాయిదాల’ పర్వం: ఏళ్ల తరబడి మేకింగ్.. ఆడియన్స్‌లో ఆసక్తి చంపేస్తోందా?
ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే అభిమానులు రోజులు లెక్కపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “ఈ తేదీకి ఖచ్చితంగా వస్తుంది” అని చెప్పిన పాన్-ఇండియా సినిమాలు వరుసగా వాయిదా పడుతూ.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. మొదట్లో ఉన్న హైప్.. తర్వాత మీమ్స్, ట్రోల్స్‌గా మారిపోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
భారీ కలలు.. అంతకంటే భారీ ఆలస్యాలు!
‘బాహుబలి’ తర్వాత ప్రతి ఇండస్ట్రీ కూడా పాన్-ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టింది. భారీ బడ్జెట్‌లు, వీఎఫ్‌ఎక్స్, స్టార్ క్యాస్టింగ్, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌లు.. ఇవన్నీ కలిసి సినిమాల స్కేల్ పెంచేశాయి. కానీ అదే సమయంలో మేకింగ్ టైమ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
ముఖ్యంగా కొన్ని సినిమాలు ప్రకటించి ఏళ్లు గడిచినా ఇంకా రిలీజ్‌కు రాకపోవడం ప్రేక్షకుల్లో అసహనాన్ని పెంచుతోంది.
లేట్ అవుతూ హైప్ కోల్పోతున్న సినిమాలు!
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న Vishwambhara ఒకటి. భారీ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతుండటంతో అభిమానులు కూడా “అసలు ఎప్పుడు వస్తుంది?” అని అడుగుతున్నారు.
అలాగే The Raja Saab పరిస్థితి కూడా ఇలానే మారింది. మొదట ప్రకటించిన తర్వాత వరుస ఆలస్యాలు చేసి రిలీజ్ జరగడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా కనిపించాయి.
Hari Hara Veera Mallu అయితే వాయిదాల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయినా సినిమా వాయిదాలు చివరికి రీలీజ్ అయి ఫ్లాప్ అయింది
ఇక Game Changer కూడా చాలాకాలంగా మేకింగ్‌లో ఉండటం వల్ల మొదట్లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ కొంత తగ్గిపోయాయనే కామెంట్స్ వినిపించాయి.ఆ తర్వాత ఎట్టకేలకు రిలీజ్ అయి డిజాస్టర్ అయింది.
బాలీవుడ్‌లో Brahmāstra Part Two: Dev, తమిళంలో Indian 3 లాంటి సినిమాలు కూడా ఎక్కువ ఆలస్యాల వల్ల చర్చకు వచ్చాయి.
సోషల్ మీడియా కాలంలో హైప్ నిలబెట్టడం కష్టం!
ఇప్పుడు ప్రతి వారం కొత్త సినిమా, కొత్త టీజర్, కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక సినిమా మూడు లేదా నాలుగు ఏళ్లు లేట్ అయితే ప్రేక్షకుడు కూడా మెంటల్‌గా మూవ్ ఆన్ అయిపోతున్నాడు.
ముఖ్యంగా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మొదట హైప్ ఇచ్చిన వాళ్లే.. తర్వాత ట్రోల్స్ చేయడం మొదలుపెడుతున్నారు. “అప్డేట్ ఎప్పుడు?”, “రిలీజ్ ఎప్పుడు?” అనే కామెంట్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి.
ఎక్కువ టైమ్ తీసుకుంటేనే మంచి సినిమా వస్తుందా?
కొన్ని సినిమాలకు నిజంగానే సమయం అవసరం ఉంటుంది. భారీ వీఎఫ్‌ఎక్స్, వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ సెటప్స్ కోసం ఎక్కువ కాలం పడటం సహజమే. కానీ ప్రేక్షకులు ఇప్పుడు ఒక విషయం క్లియర్‌గా చెబుతున్నారు — “లేట్ అయినా పర్వాలేదు.. కానీ అవుట్‌పుట్ మాత్రం బ్లాక్‌బస్టర్ స్థాయిలో ఉండాలి” అని.
ఎందుకంటే ఇటీవల కొన్ని సినిమాలు ఏళ్ల తరబడి తీసి కూడా అంచనాలు అందుకోలేకపోయాయి. దీంతో “ఎక్కువ టైమ్ = మంచి సినిమా” అనే ఫార్ములాపై కూడా సందేహాలు మొదలయ్యాయి.
చివరికి కంటెంట్‌నే గెలిపిస్తుంది
వాయిదాలు ఎంతైనా.. సినిమా బాగుంటే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. Baahubali 2: The Conclusion, KGF: Chapter 2, RRR లాంటి సినిమాలు అందుకు ఉదాహరణలు.
కానీ హైప్‌ను ఎక్కువకాలం లాగి.. చివరికి కంటెంట్ నిరాశపరిస్తే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు.
