తెలుగు ముద్దుగుమ్మలకు ఆ విషయం లో అన్యాయం..!
మన తెలుగు ఇండస్ట్రీ (Tollywood) కి ఒక విచిత్రమైన జబ్బు ఉంది. పక్కింటి అమ్మాయిలా ఉండే మలయాళ భామలు (అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్) వస్తే నెత్తిన పెట్టుకుంటారు. నార్త్ నుంచి దీపికా పదుకొనే, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ వస్తే కోట్లు పోసి మరీ రెడ్ కార్పెట్ వేస్తారు. కానీ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, అద్భుతమైన టాలెంట్ చూపిస్తున్న మన తెలుగు ముద్దుగుమ్మలు మాత్రం స్టార్ హీరోల పక్కన ఎందుకు పనికిరారు?
శ్రీలీలకు ఒక న్యాయం.. రితూ వర్మకు మరో న్యాయమా? శ్రీలీల విషయానికి వస్తే, ఆమె తెలుగు అమ్మాయే అయినా పెరిగింది అమెరికా/బెంగళూరులో, పైగా ఫుల్ గ్లామర్ షోకి సై అంటుంది కాబట్టి స్టార్ హీరోల సినిమాలు దక్కించుకుంది. కానీ పక్కా లోకల్ అయిన ఈషా రెబ్బా, రితూ వర్మ, చాందిని చౌదరి, అనన్య నాగళ్ల లాంటి వాళ్లకు ఎంత టాలెంట్ ఉన్నా సరే, టైర్-2 లేదా టైర్-3 హీరోలతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టైర్-1 హీరోల సినిమాల్లో మన తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఎందుకు కనిపించరు?
గ్లామర్ లేదనా? మార్కెట్ లేదనా? స్టార్ హీరోల సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ కావాలి కాబట్టి బాలీవుడ్ భామలు కావాలని మేకర్స్ చెబుతుంటారు. కానీ కేవలం తెలుగు మార్కెట్ కోసం తీసే సినిమాల్లో కూడా మన వాళ్లకు ఛాన్స్ ఇవ్వరు. “తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో, స్కిన్ షో చేయడానికి వెనకాడుతారు” అనేది ఒక సాకు మాత్రమే. నిజానికి లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం మన దర్శకుల్లో, నిర్మాతల్లో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ వివక్ష పోతే తప్ప మన తెలుగు అందాలకు న్యాయం జరగదు.
మన తెలుగు హీరోయిన్లకు ఎందుకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావట్లేదు.. కారణాలు ఏంటి కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.
