Viral News

సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం: లెజెండరీ సింగర్ ఎస్. జానకి (88) కన్నుమూత!

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. ఐదు దశాబ్దాల పాటు తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన ‘గాన కోకిల’, ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్. జానకి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె, గుండెపోటుకు గురై మైసూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మనవరాలి అధికారిక ప్రకటన: గతంలో పలుసార్లు ఆమె ఆరోగ్యంపై వదంతులు వచ్చినప్పటికీ, ఈసారి ఈ విషాద వార్తను జానకమ్మ కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. జానకి గారి మనవరాలు అప్సరా విద్యుల (Apsara Vydyula) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెడుతూ.. “నా ప్రియమైన నానమ్మ, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి గారు ఇక లేరనే విషయాన్ని ఎంతో బాధతో తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల మధ్య ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ప్రపంచానికి ఆమె ఒక ఐకానిక్ వాయిస్, కానీ మాకు మాత్రం ఆమె ఎంతో ప్రేమను పంచిన నానమ్మ” అంటూ ఈ వార్తను కన్ఫర్మ్ చేశారు.

సిరిసిల్లతో జానకమ్మకు ఉన్న అనుబంధం: ఎస్. జానకి గారు 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు కాగా, తల్లి సత్యవతి గృహిణి. తండ్రి టీచర్ వృత్తి కారణంగా జానకమ్మ కుటుంబం కొన్నేళ్ల పాటు తెలంగాణలోని సిరిసిల్లలో కూడా నివసించింది. అలా తెలుగు రాష్ట్రాలతో ఆమెకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది.

దాదాపు 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడి, 4 జాతీయ అవార్డులు, మరెన్నో రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న ఎస్. జానకి గారి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన పాటల రూపంలో జానకమ్మ స్వరం ఎప్పటికీ మన హృదయాల్లో నిత్యం మారుమోగుతూనే ఉంటుంది.

ఎస్. జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ‘సినీ దావత్ ‘ తరపున ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం.

జానకి గారు పాడిన పాటల్లో మీకు నచ్చినవి కామెంట్స్ లో రాయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *