శిరీష్ కామెంట్స్‌తో రగులుకున్న టాలీవుడ్: చరణ్ ‘పెద్ది’కి భారీ షాక్!
నిర్మాత శిరీష్ (SVC) ప్రెస్ మీట్ పెట్టి “సింగిల్ స్క్రీన్స్‌లో ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకోము, ప్రభుత్వం జీవో (GO) ఇచ్చినా సరే సింగిల్ స్క్రీన్స్ లో పెంచనివ్వం” అని చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో పెద్ద భూకంపమే సృష్టించాయి. ఈ కామెంట్స్‌పై అప్పుడే ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయి స్పందిస్తోంది.
శిరీష్‌కు చదలవాడ శ్రీనివాస్ ఫుల్ సపోర్ట్! ఈ ఇష్యూలో శిరీష్ మరియు సునీల్ నారంగ్ లకు సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాస్ పూర్తిగా మద్దతు పలికారు. “గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్లు) ఎన్నో కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎగ్జిబిటర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కేవలం అద్దె (Rental) సిస్టమ్ వల్ల థియేటర్లు నష్టపోతున్నాయి.. అందుకే పర్సంటేజ్ (Percentage) రెవెన్యూ షేరింగ్ సిస్టమ్ తీసుకురావాలన్న తెలంగాణ ఎగ్జిబిటర్ల డిమాండ్ కు నా పూర్తి మద్దతు ఉంటుంది” అని చదలవాడ స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది.
రామ్ చరణ్ ‘పెద్ది’ కి భారీ దెబ్బ! ఎగ్జిబిటర్లు మరియు శిరీష్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ ‘పెద్ది’ (Peddi) కు అతిపెద్ద షాక్ తగిలినట్లు అయింది. ఈ సినిమాకు నిజాం (Nizam Box Office) ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ‘మైత్రీ మూవీ మేకర్స్’ (Mythri Movie Makers) సొంతం చేసుకుంది. భారీ రేట్లకు కొన్న మైత్రీ సంస్థ.. ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
మైత్రీ vs ఎగ్జిబిటర్స్: నెల రోజుల్లో ‘పెద్ది’ రిలీజ్ పెట్టుకుని, థియేటర్ ఓనర్లు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచబోము అని తెగేసి చెప్పడంతో మైత్రీ సంస్థకు పెద్ద తలనొప్పి మొదలైంది. రేట్లు పెంచకపోతే భారీ బడ్జెట్ సినిమాలకు నిజాంలో పెట్టుబడి రికవరీ కావడం దాదాపు అసాధ్యం. అటు ఎగ్జిబిటర్లు ఏమో తమకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలని, రేట్లు పెంచేది లేదని పట్టుబడుతున్నారు.
మరి ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ వెనక్కి తగ్గుతుందా? లేక పెద్దల సమక్షంలో ఏదైనా రాజీ ఫార్ములా తీసుకువస్తారా? అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఏదేమైనా.. శిరీష్ అంటించిన నిప్పు ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద మంటనే రేపుతోంది.
ఈ సమస్య ఎంతవరకు దారి తీస్తుంది అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.
