“నాకు ఇదే వచ్చు.. ఇంకేదైనా ఆశించి ఉంటే క్షమించండి” – ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ మీట్లో హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు హరీష్ శంకర్ సినిమాపై వస్తున్న రివ్యూలు, నెగటివిటీపై తనదైన శైలిలో స్పందించారు.
షార్ట్ టైంలో అవుట్ పుట్.. అదో పెద్ద సక్సెస్!
ముందుగా తన టీం పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ.. “మా టీం అందరికీ కోటి కృతజ్ఞతలు. ముఖ్యంగా థమన్ అండ్ టీం, పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశారు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల్లా వంతుల వారీగా నిద్రపోతూ 16వ తేదీ లోపు ప్రింట్లు రెడీ చేయడం అనేది ఈ సినిమాకు దక్కిన మొదటి విజయం” అని హరీష్ శంకర్ తెలిపారు.
కథ కంటే కళ్యాణ్ గారి స్వాగ్కే ప్రియారిటీ!
సినిమాలోని కంటెంట్ గురించి వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. “నేను మొదటి నుంచి ఒకటే చెబుతున్నాను, నేను తీసింది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆ పాత స్వాగ్ లో, ఆయన ఒరిజినల్ మేనరిజమ్స్ మరియు హిస్ట్రియానిక్స్తో చూపించాలనేదే నా లక్ష్యం. చాలా ఏళ్లుగా అభిమానులు మిస్ అవుతున్న ఆ ‘పవర్ ప్యాక్డ్’ బాడీ లాంగ్వేజ్‌ను ఈ సినిమాలో చూపించాను” అని అన్నారు.
క్లైమాక్స్ డైలాగ్ వెనుక ఉన్న పెయిన్..
సినిమాలో ‘బొట్టు పెట్టడం’ గురించి ఉన్న డైలాగ్ ఏదో అప్పటికప్పుడు రాసింది కాదని, అది మన సంప్రదాయం మీద జరిగిన కొన్ని దాడుల వల్ల కలిగిన బాధ నుంచి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. భగత్ సింగ్ క్యారెక్టర్ ఆర్క్ చిన్నప్పటి నుంచి జాతీయతా భావంతో సాగుతుందని, అందుకే ఆ క్లైమాక్స్ డైలాగ్ అంత పవర్ఫుల్ గా వచ్చిందని చెప్పారు.
సంచలనంగా మారిన “సారీ” కామెంట్స్!
స్పీచ్ చివర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాట్లాడుతూ
“నేను పవన్ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం మీదే ఫోకస్ పెట్టాను. ఆయన స్వాగ్, డైలాగ్ డెలివరీనే నా టార్గెట్. ఒకవేళ నన్ను ఒక గొప్ప కళాఖండాన్నో లేక అద్భుతమైన కొత్త కథనో తీయాలని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే.. నన్ను దయచేసి క్షమించండి. నాకు ఇదే వచ్చు.. నేను ఇలాగే చేస్తాను.”
హరీష్ శంకర్ గారు ఎంతో ధైర్యంగా తన పనిని సమర్థించుకోవడమే కాకుండా, పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూపించడంలో తనకు మించిన వారు లేరని మరోసారి ఈ స్పీచ్ ద్వారా నిరూపించుకున్నారు.
Cine Dawat తరపున ఈ సక్సెస్ ఫుల్ సినిమాకు హరీష్ శంకర్ గారికి మరియు చిత్ర యూనిట్ కు అభినందనలు!
మరిన్ని ఆసక్తికరమైన మూవీ అప్డేట్స్ కోసం Cine Dawat ను ఫాలో అవ్వండి!
