మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ: నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి క్రేజీ టాక్ షో.. ‘మెగావర్స్’ షూటింగ్ షురూ!
మెగాస్టార్ అంటేనే వైవిధ్యానికి మరో పేరు! దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో, డాన్సులతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎప్పటినుంచో ఆయన ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ‘మెగావర్స్’ (Megaverse) పేరుతో రూపొందుతున్న ఒక వినూత్నమైన టాక్ షో ద్వారా బాస్ ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి గ్రాండ్‌గా అడుగుపెడుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘మెగావర్స్’ సందడి
గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ ప్రతిష్టాత్మక షోను ప్రసారం చేయనుంది. ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. తనదైన టైమింగ్, సహజమైన ఆత్మీయతతో ఆసక్తికరమైన సంభాషణలు, అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణతో ఈ షో సాగనుంది.
తరతరాల తారలతో మెగా ముచ్చట్లు
‘మెగావర్స్’ షోలో ప్రేక్షకులతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూనే.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విభిన్న తరాలకు చెందిన స్టార్స్‌తో చిరు ముచ్చటించనున్నారు. భారతీయ సినిమా గొప్ప లెగసీని సెలబ్రేట్ చేస్తూ, ఈ వేదిక ద్వారా ప్రేక్షకులు అభిమానించే ఎంతోమంది దిగ్గజాల జీవితాలు, వారి ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను మరింత సన్నిహితంగా పరిచయం చేయనున్నారు. ఈ షోకు మెగాస్టార్ తన ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ప్రారంభమైన షూటింగ్..
ఈ భారీ ప్రతిష్టాత్మక షోను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, SOL ప్రొడక్షన్ LLP సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ‘మెగావర్స్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షోలో పాల్గొనబోయే గెస్ట్‌లు ఎవరు? స్ట్రీమింగ్ ఎప్పటినుంచి? లాంటి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను నెట్‌ఫ్లిక్స్ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది. వెండితెరను ఏలిన మెగాస్టార్, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి!
సినీ అభిమానులుగా మీరు కూడా ఎదురు చూస్తున్నారా కింద కామెంట్ చేయండి
