Viral News

కీప్ షైనింగ్ నా హనీ పాపా”.. కూతురి బర్త్‌డేకి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్! వైరల్ అవుతున్న రేర్ ఫోటోలు!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్క్రీన్ మీద ఎంతటి మాస్ హీరోనో, నిజ జీవితంలో అంతకు మించిన ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తన కుటుంబ సభ్యుల పుట్టినరోజులొచ్చినా, పండుగలొచ్చినా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు తన ఎక్స్ (Twitter) ఖాతాలో ఒక అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. అలాగే సుస్మిత చిన్ననాటి అరుదైన ఫోటోలను పంచుకున్నారు.

నా వేలు పట్టుకు నడిచిన చిన్నారి: తన గారాల పట్టికి బర్త్‌డే విషెస్ చెబుతూ చిరంజీవి గారు ఎంతో ఎమోషనల్ అయ్యారు. “నా వేలు పట్టుకుని నడిచిన ఒక చిన్నారి స్థాయి నుంచి.. ఈరోజు ఒక స్ట్రాంగ్, గ్రేస్ ఫుల్ మరియు బాధ్యతాయుతమైన మహిళగా నువ్వు ఎదగడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రియమైన సుష్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని మెగాస్టార్ రాసుకొచ్చారు.

కూతురు సక్సెస్ చూసి మురిసిపోతున్న తండ్రి: సుస్మిత కొణిదెల కేవలం కాస్ట్యూమ్ డిజైనర్ గానే కాకుండా, నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి చిరంజీవి గారు ప్రస్తావిస్తూ.. “ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణం ఏదైనా ఉందంటే.. అది నా సినిమాలు చూస్తూ పెరిగిన నా కూతురు, ఇప్పుడు నాకే ఒక సినిమాను నిర్మించి, నాకు ఒక చిరస్మరణీయమైన బ్లాక్ బస్టర్ ను ఇవ్వడం. అది నన్ను నిజంగా ఎంతో గర్వపడేలా చేసింది. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయురారోగ్యాలు, సంతోషం, అంతులేని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను. కీప్ షైనింగ్ మై డియర్ హనీ పాపా.. నా ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి” అంటూ ముగించారు.

వైరల్ అవుతున్న రేర్ ఫోటోలు: ఈ పోస్ట్‌తో పాటు చిరంజీవి గారు పంచుకున్న నాలుగు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో సుస్మిత చిన్నప్పుడు స్ట్రోలర్ (Stroller) లో ఉన్నప్పుడు చిరంజీవి, సురేఖ గారు ఆడిస్తున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి కాగా.. మరొక ఫోటోలో సుస్మితను చిరు భుజాల మీద ఎక్కించుకుని అల్లరి చేస్తున్నారు. మరో ఫోటోలో పాపకు ప్రేమగా ముద్దు పెడుతున్నారు. చివరి ఫోటోలో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎదిగిన తన కూతురితో కలిసి ఎంతో గర్వంగా ఫోటోకు పోజు ఇచ్చారు మెగాస్టార్.

ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు “హ్యాపీ బర్త్‌డే సుస్మిత అక్క” అంటూ కామెంట్స్ బాక్స్ ను నింపేస్తున్నారు. మన ‘సినీ దావత్’ తరపున కూడా సుస్మిత కొణిదెల గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *